ఇవాళ గజ వాహనంపై విహరించనున్న శ్రీ పద్మావతి అమ్మవారు..

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి తెప్పపై విహరించగా.. నిన్నటి నుంచి పద్మావతి అమ్మవారు విహరిస్తున్నారు. నిన్నటి నుంచి పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు అమ్మవారు గజవాహనంపై విహరించనున్నారు. ఇక మూడవ రోజైన బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుంmr తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

Share this post with your friends