అడుగుకో ఆలయం.. ఎటు చూసినా దేవతల విగ్రహాలు.. ఆ గ్రామమే ఓ దేవలోకం…

ఇలాంటి గ్రామం ఎక్కడో అరుదుగా కానీ కనిపించదు. అదసలు వాస్తవానికి గ్రామమా? లేదంటే దేవలోకమా? అనే అనుమానం కలుగక మానదు. ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా ఆలయాలు.. ఎటు చూసినా దేవతా విగ్రహాలు.. చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని ప్రకృతి.. అందమైన కోనేరులు, పురాతన మంచి నీటి బావులు నడుమ అది దేవలోకంలా కనిపిస్తుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటారా? ఎక్కడో కాదు.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రానికి 9 కిలో మీటర్ల దూరంలో నగునూర్ గ్రామం ఉంటుంది. ఇక్కడ దాదాపు 400 ఆలయాలున్నట్టు చరిత్ర చెబుతోంది. కాకతీయులు పాలించిన ఈ గ్రామం ఆధ్మాత్మికతకు పుట్టిల్లుగా కనిపిస్తుంది.

కాకతీయులంతా శివభక్తులు కావడంతో ఈ ఊరినిండా శివాలయాలు, నంది విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ గ్రామంలో కాకతీయుల ఆనవాళ్లు అడుగడునా కనిపిస్తాయి. ఎర్రబండతో నిర్మించిన ఆలయం దక్షిణ భారతదేశం మొత్తమ్మీద ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇది త్రికూట ఆలయం. పెద్ద పెద్ద శివాలింగాలున్న ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకున్నా కూడా ధ్వజస్తంభాలు, ఇతర ఆనవాళ్లు మాత్రం పదిలంగా ఉన్నాయి. ఈ గ్రామంలో ఎక్కడ తవ్వితే అక్కడ ఏదో ఒక ఆలయమో.. శివలింగమో.. కనీసం నంది విగ్రహం అయినా బయటపడుతోంది. ఇక్కడ చూస్తున్న శివలింగాలైతే అద్భుతంగా ఉన్నాయట. ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Share this post with your friends