పుట్టింటికి వచ్చే గ్రామ దేవతలను సంతోషపరచడమే బోనాలు..

తెలంగాణ రాష్ట్రం.. గ్రామీణ, సాంస్కృతిక వారసత్వాన్ని బలమైన సంబంధం కలిగి ఉంది. పేద, గొప్ప తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలూ ఈ వేడుకను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. దీనిని బోనాల పండుగ అని.. ఆషాఢ జాతర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆషాఢమాసంలోని మొదటి ఆదివారం లేదంటే గురువారం నుంచి ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆషాఢమాసంలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అలాగే రైతులు పంటలు వేస్తారు కాబట్టి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని.. పంటలు సమృద్ధిగా పండాలని.. పాడి ఇంటికి చేరాలని రైతులు కోరుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు.

ఇక వ్యాధుల బారి నుంచి రక్షించాలని సైతం అమ్మవారిని కోరుకుంటారు. అయితే ప్రతి ఏటా ఆషాఢమాసంలో గ్రామ దేవతలంతా పుట్టింటికి వస్తారని.. కాబట్టి వారిని సంతోష పరచడమే బోనాల ఉద్దేశమని కూడా చెబుతుంటారు. పుట్టింటికి వచ్చిన అమ్మవార్లను సాదరంగా ఆహ్వానించి, నివేదనలు సమర్పించి ఆపై కోరికలు కోరుకుంటూ ఉంటారు. కోరికలు తీరిన వారు అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. నూట యాబై ఏళ్ళ కిందట ప్లేగు వ్యాధి హైదరాబాద్‌ నగరాన్ని కల్లోలపరచినప్పుడు… తమను ఆ మహమ్మారి బారి నుంచి కాపాడాలని వేడుకుంటూ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారట. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ప్రతి ఏటా బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Share this post with your friends