శ్రీవారి ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులతో ఈవో సమీక్ష

శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్షించారు. సమీక్షా సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.అంతకుముందు తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రంటీస్‌గా అవకాశం కల్పించి, వారు భవిష్యత్తును నిర్మించుకునేలా చేయాలని అర్చకులు ఈఓకు సూచించారు.

గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా నిర్వహించాలని ఈఓను కోరారు. అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన శ్రీ శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ.. కోవిడ్‌ కాలంలో తగ్గించిన ప్రసాద దిట్టం ఇంకా కొనసాగుతూనే ఉందని, దానిని పెంచాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆగమ సలహాదారులు ఆలయం ప్రతిష్టటకు భంగం కలుగకుండా పురాతన సంప్రదాయాలు పరిరక్షించడంలో, ఆచారాలకు విఘాతం కలుగకుండా చూసుకోవడంలో తమ పాత్రను ఈవోకు తెలియజేశారు. ఈ రెండు సమావేశాల అనంతరం శ్రీవారి అన్నప్రసాదాలపై ఆలయ, పోటు అధికారులతో ఈవో సమీక్షించారు.

Share this post with your friends