శ్రీవారి ఆలయంలో జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.

Share this post with your friends