మెహందీపూర్ బాలాజీ ఆలయం.. దీని ప్రత్యేకతేంటో తెలుసా?

రాజస్థాన్‌లో ఓ ఆలయం ఉంది. ఆ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ ఆలయం ఎవరిది? ఏమా కథ? అంటారా? ఆ ఆలయం ‘మెహందీపూర్ బాలాజీ’ ఆలయం. ఈ ఆలయం నిత్యం దెయ్యాలు పీడుస్తున్నాయని భావించే వారితో నిండి ఉంటుంది కాబట్టి ఒకింత భయంకరంగానే ఉంటుంది. రాజస్థాన్లోని అరావళీ పర్వాతల నడుమ దౌసా అనే జిల్లాలో ఈ ఆలయం ఉంది. వాస్తవానికి ఇదొక చిన్న ఆలయం కానీ దుష్టశక్తుల నుంచి విముక్తి కల్పిందని బాగా ప్రచారం జరగడంతో ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. ఎప్పుడో వేయి సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఓ భక్తునికి ఆంజనేయుడు బాలుని రూపంలో కనిపించి తాను ఫలానా చోట తాను ఉన్నానని, అక్కడకు చేరుకుని రోజూ తనని పూజించమని చెప్పాడట.

అయితే ఎంత వెదికినా స్వామివారు కనిపించలేదట. కొద్దిరోజుల తర్వాత స్వామివారు మళ్లీ కలలో కనిపించి తాను వెలసిన చోటు గురించి చెప్పడంతో అక్కడకు వెళ్లగా.. బాలహనుమంతునితో పాటుగా మరో రెండు విగ్రహాలు కూడా కనిపించాయట. ఒకటి శివుని ఉగ్రరూపమైన భైరవుని విగ్రహం కాగా.. మరొకటి దుష్టశక్తులకు రాజుగా భావించే ‘ప్రేతరాజు’ విగ్రహం. ఇక ఈ ఆలయానికి దుష్టశక్తుల బారిన పడ్డవారు, మానసిక స్థితి సరిగా లేనివారు, మూర్ఛరోగులు, పక్షవాతంతో బాధపడేవారు మాత్రమే కాకుండా సంతానం లేనివారు కూడా వస్తుంటారు. ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తప్పక సమస్యల నుంచి బయట పడతారని నమ్మకం.

Share this post with your friends