తిరుమలలో వైభవంగా శ్రీవారికి పుష్ప పల్లకి సేవ

వార్షిక ఆణివార ఆస్థానంలో భాగంగా మంగళవారం ఆహ్లాదకరమైన సాయంత్రం తిరుమలలో అంగరంగ వైభవంగా పుష్ప పల్లకీ సేవ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి చక్కగా అలంకరించబడిన పూల పల్లకిపై విహరించి నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల వెంబడి భక్తులను ఆశీర్వదించారు. తిరుమల తిరుపతి దేవస్థానికి చెందిన గార్డెన్ నిర్వాహకులు వివిధ రకాల రంగురంగుల సాంప్రదాయ, అలంకార, అన్యదేశ పూలతో పల్లకిని అందంగా అలంకరించారు. అలాగే పల్లకీలో కృత, త్రేతా, ద్వాపర యుగాలకు చెందిన వివిధ దేవతల చిత్రాలను కూడా ప్రదర్శించారు.

అందమైన పూల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, ఆలయ డీఈవో శ్రీ లోకనాథం, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, పీష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,409 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 26,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

Share this post with your friends