అమర్‌నాథ్ యాత్ర చేయడం వలన కలిగే ప్రయోజనమేంటంటే..

అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం తరలి వస్తున్నారు. వాస్తవానికి ఈ యాత్ర సవాళ్లతో కూడుకున్నది. అయినా కూడా ఎందుకు ఈ యాత్ర నిర్వహించేందుకు భక్తులు వెనుకాడరు? అంటే.. ఇక్కడి మంచు రూపంలో ఉండే శివయ్య మహత్యం అనే చెప్పాలి. ఈ గుహ రహస్యం కూడా అందుకు ఓ కారణమే. అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉంది. జమ్మూ, కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో అమర్‌నాథ్ పర్వతంపై ఈ గుహ ఉంటుంది. ఇక్కడ సహజ సిద్ధంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది. ఈ మంచు శివలింగాన్ని బాబా బర్ఫానీ అని పిలుస్తారు. ఇలా మంచుతో ఏర్పడే శివలింగం ప్రపంచంలోనే ఇదొక్కటే కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు.

దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ గుహను గుర్తించారట. హిందూ పురాణాల ప్రకారమైతే ఈ గుహకు చాలా ప్రాధాన్యత ఉంది. అదేంటంటే.. ఇక్కడ పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడట. కాబట్టి ఇక్కడ బాబా బార్ఫానీని దర్శిస్తే సకల పాపాలు నశించి అమరత్వాన్ని పొందుతామని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. పైగా ఈ ఒక్క గుహను దర్శిస్తే 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం వస్తుందట. అలాగే కాశీలో శివ లింగాన్ని దర్శించడం కంటే 10 రెట్లు, ప్రయాగ కంటే 100 రెట్లు, నైమిశారణ్య తీర్థం కంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందట. ఈ యాత్ర చేసిన వ్యక్తి సుఖ సంతోషాలతో జీవిస్తాడని నమ్మకం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున బాబా బర్ఫానీని దర్శించుకునేందుకు వ్యయ ప్రయాసాలకోర్చి వస్తుంటారు.

Share this post with your friends