భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుమల ఈవో జాగ్రత్తలు..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసి వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం టీటీడీ జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పలు సమస్యలను ఈఓకు తెలియజేశారు. భక్తుల క్యూలు విస్తరించిన ప్రాంతంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరులో లోపం, సమయానికి శానిటరీ మెటీరియల్స్‌ను ఏజెన్సీ లు సరిగ్గా సరఫరా చేయకపోవడం, నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరా చేయడం తదితర అంశాలను తెలిపారు.

పలు సమస్యలను సావధానంగా విన్న ఈవో, కాంట్రాక్టర్‌లను కఠినంగా హెచ్చరించాలని, నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్‌ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత చర్యలను మెరుగుపరిచేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని జేఈఓలను ఆదేశించారు. మూడు రోజుల తర్వాత ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుధ్యంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆయన జేఈవోలను ఆదేశించారు. తిరుమలకు ప్రపంచ ప్రసిద్ధ హైందవ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం గానే కాకుండా ప్రతిరోజు వేల మంది భక్తులు విచ్చేసినా పరిశుభ్రతకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. తిరుమల, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భక్తుల్లో సంస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు. ఆరోగ్య విభాగం బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవసరాలను యాజమాన్యం చూసుకుంటుందన్నారు. అయితే సిబ్బంది యావత్తు పరిసరాల పరిశుభ్రత విషయంలో ముఖ్యంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని,పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. తిరుమలలో ప్రాంతాల వారీగా, షిఫ్ట్‌ల వారీగా అవసరమయ్యే కార్మికుల జాబితా, అంచనా వేసి, సిబ్బంది సమస్యల పరిష్కారానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఈఓ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Share this post with your friends