Site icon Bhakthi TV

తిరుమల నడక మార్గం భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత : టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రత విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత చర్యలపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జంతువుల కదలికలపై సమాచారాన్నిఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులను ఆదేశించారు.

కాలినడక మార్గంలో ఏఏ సమయాల్లో భక్తుల రాకపోకలు అధికంగా / తక్కువగా ఉన్నాయో, ఏఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయో, తదితర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా, ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో శ్రీ నరసింహ కిషోర్ కు సూచించారు. అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రతిపాదనలలో ఏఏ పనులు చేపట్టడం జరిగింది, ఎన్ని పురోగతిలో ఉన్నాయి, ఇంకెన్ని పనులు చేయవలసి ఉన్నాయి అనే అంశాలపై ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్వి జూ పార్క్ క్యూ రేటర్ శ్రీ సెల్వం, తిరుపతి డిఎఫ్ఓ శ్రీ సతీష్, సబ్ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, టిటిడి డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ మల్లికార్జున్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version