సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడంటే..

జులై నెల‌లో ఆషాడ పౌర్ణమి రోజున సింహాచ‌లంలో గిరి ప్రద‌క్షిణ వైభ‌వంగా జరుగుతూ ఉంటుంది. సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వ‌రాహ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం కొండ చుట్టూ భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉంటారు. ఈ కొండ చుట్టూ దాదాపు 32 కిలో మీట‌ర్లు ఉంటుంది. ఈ నెల ల20వ తేదీన సాయంత్రం 4 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. తొలి పావంచా వద్ద నుంచి పుష్ప రథం ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై ధ‌ర్మక‌ర్త, ఆల‌య కార్యనిర్వహ‌ణాధికారి కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటలకు భక్తులంతా పుష్పరథంతో పాటు నడుస్తూ గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. రథం ముందు వలంటీర్లు నృత్యాలు చేస్తుంటారు. కోలాహలంగా ఈ గిరి ప్రదక్షిణ సాగుతుంది. గిరి ప్రదక్షిణ పూర్తైన అనంతరం మెట్ల మార్గంలో సింహగిరి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఆ రోజున రాత్రి 10 గంటల వరకూ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 21న అయితే విజయోత్సవం నేపథ్యంలో స్వామివారి దర్శనం సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే ఉంటుంది. గిరి ప్రదర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ పరిశీలించారు. గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Share this post with your friends