విష్ణుమూర్తిని బృందాదేవి ఎందుకు శపించింది?

బృందా దేవి భర్త అయిన రాక్షస రాజు జలంధరుడు భీభత్సం సృష్టిస్తూ విశ్వమంతా అల్లకల్లోలం చేస్తున్నాడట. దీంతో కలత చెందిన దేవతలు.. తమను జలంధరుడిని నుంచి కాపాడమని మహా విష్ణువును వేడుకున్నారట. జలంధరుడిని చంపేయాలని కోరారట. అయితే జలంధరుడిని చంపడం అంత సులభం కాదు. అతనికి అతని భార్యే రక్షణ. అతడిని ఓడించడం దుర్లభం. అయినా సరే.. విష్ణుమూర్తి తాను కాపాడతానని హామీ ఇచ్చాడు. జలంధరుడి రూపంలో బృంద ముందుకు విష్ణుమూర్తి వెళ్లాడట. ఆమె కూడా ఆయన తన భర్తేనని పూర్తిగా నమ్మింది. తన భర్త అనుకుని విష్ణుమూర్తి పాదాలు తాకగానే.. దేవతలు యుద్ధంలో జలంధరుడిని వధించారు.

విషయం తెలుసుకున్న బృంద నువ్వు ఎవరు అని అడగ్గా.. అప్పుడు విష్ణు మూర్తి తన నిజరూపాన్ని ధరించాడట. విష్ణుమూర్తిని చూసిన బృందాదేవి కన్నీటి పర్యంతమైందట. తానెప్పుడు విష్ణు మూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నానని.. అలాంటి భగవంతుడే తనకు పసుపు కుంకాలను దూరం చేశాడన్న ఆవేదనతో విష్ణుమూర్తిని రాయిలా మారాలని శపించిందట. బృంద శాపంతో విష్ణుమూర్తి రాయిలా మారాడట. విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి.. బృందాదేవి వద్దకు వెళ్లి తన భర్తను క్షమించి శాప విమోచనం కలిగించాలని కోరిందట. దీంతో బృందాదేవి తన శాపాన్ని ఉపసంహరించుకుని భర్తతో పాటు సతీసహగమనం చేసిందట.

Share this post with your friends